వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో సగం వాటా భారత్, చైనాలదే ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్ జార్జీవా అంచనా వేశారు. 2021 తర్వాత ప్రపంచ ఆర్థికం పురోగమించిన తర్వాత రష్యా దండయాత్ర మళ్లీ తీవ్ర కలవరపాటుకు గురిచేసినట్లు తెలిపారు. యుద్ధం వల్ల 2022లో ఆర్థిక వృద్ధి సగానికి అంటే.. 6.1 నుంచి 3.4 శాతానికి దిగజారినట్లు వివరించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. ఈ ఏడాదీ తక్కువ వృద్ధినే నమోదు చేస్తుందని IMF తెలిపింది. ఇది 3 శాతం కన్నా తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసింది. ఈ పరిస్థితి మరో ఐదేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర, కోవిడ్ సంక్షోభాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు ఈ ఏడాదీ కొనసాగుతాయని వివరించింది.
అయితే ఆసియాలో మాత్రం ఆర్థిక వృద్ధి ప్రకాశవంతంగానే ఉంటుందని IMF చీఫ్ జార్జీవా పేర్కొన్నారు. 1990 నుంచి అత్యల్ప మధ్యకాలిక వృద్ధి నమోదవుతున్నట్లు గుర్తుచేసిన ఆమె.. 2 దశాబ్దాల నుంచి ఆర్థిక వృద్ధి సగటున 3.8 శాతం కంటే తక్కువేనన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్, చైనాల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని IMF తెలిపింది.