మన దాయాది దేశమైన పాకిస్థాన్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ రాజీనామా చేయబోతున్నారు. ఇస్లామాబాద్ లో ఇవాళ చేపట్టనున్న పబ్లిక్ ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ర్యాలీ లో నే ఇమ్రాన్ ఖాన్.. ముందస్తు ఎన్నికల ప్రకటన కూడా చేయబోతున్నట్లు టాక్.
విదేశీ నిధుల కేసులో సోమవారం ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేసే సూచనలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటూ ఈనెల ఎనిమిదో తేదీన ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది.
సొంత పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు కూడా అవిశ్వాసానికి మద్దతు ప్రకటించడం గమనార్హం. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై సైన్యం విశ్వాసం కూడా కోల్పోయినట్లు సమాచారం అందుతోంది. ఇలాంటి తరుణంలోనే ఇవాళ ఇమ్రాన్ ఖాన్ తన పదవికి రాజీనామా చేసి ముందస్తు ఎన్నికల ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.