ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందం ముగియడంతో మళ్లీ గాజాలో నరమేధం మొదలైంది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలో మారణహోమాన్ని సృష్టిస్తోంది. ఈ దాడిలో తాజాగా 178 మంది పాలస్తీనా పౌరులు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. మరోవైపు హమాస్ బందీల్లోనూ ఐదుగురు చనిపోయినట్లు మిలిటెంట్ గ్రూప్ వెల్లడించింది. ఈ దాడులతో గాజాలో మళ్లీ దుర్భర పరిస్థితులు ఏర్పడతాయని యూఎన్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
హమాస్ బందీల్లో ఐదుగురు చనిపోయిన విషయాన్ని ధ్రువీకరించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపింది. హమాస్ బందీల్లో ఉన్న 200 మందిలో 17 మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియెల్ హగారీ వెల్లడించారు. ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ చెరలో ఉన్న 100 మంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయెల్ తమ దేశ జైళ్లలో ఉన్న 240 మంది ఖైదీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందం మరికొంత కాలం కొనసాగుతుందని భావించినా.. ఇరు వర్గాలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మళ్లీ యుద్ధం మొదలైంది.