ప్రముఖ టెక్, ఈ-కామర్స్ కంపెనీలు తమ సంస్థల నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే అమెజాన్ కూడా చేరింది. గతంలో 18వేల మందిని ఇంటికి పంపించిన అమెజాన్ తాజాగా భారీ సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించింది. ఈసారి లే ఆఫ్స్‌లో భారతీయులకూ ఉద్వాసన తప్పలేదు.
అమెజాన్ తాజాగా 9వేల మందిని ఇంటికి పంపిస్తున్నట్లు తెలిపింది. రెండో విడత ఉద్యోగుల తొలగింపును మార్చి నెలలో ఆ కంపెనీ సీఈవో యాండీ జెస్సీ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీ నుంచి 9వేల మందిని ఇంటికి పంపిస్తున్నట్లు తెలిపారు.
కంపెనీ నిర్ణయంతో భారత్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 500 మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లనున్నారు. తొలగింపునకు గురవుతున్నవారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్‌ఆర్, సహాయ విభాగానికి చెందిన వారు ఉన్నారు. మార్చి నెలలో 9 వేల మంది ఉద్యోగుల తొలగిస్తామని సంస్థ చేసిన ప్రకటనలో భాగంగానే ఇండియాలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందిస్తున్నారు.