అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొలరోడా సుప్రీం కోర్టు అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో రాష్ట్రం ట్రంప్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఇలా రెండోసారి అమెరికా అధినేతగా ఎన్నికయ్యేందుకు బరిలోకి దిగిన ట్రంప్ నకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈసారి ‘మైన్ ’ ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సెక్రటరీ తెలిపారు.
కొలరాడో తీర్పుపై రిపబ్లికన్ పార్టీ అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాల్ చేయగా రాష్ట్ర సెక్రటరీ షెన్నా బెల్లోస్ వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ పేరును ప్రైమరీ బ్యాలెట్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ఉత్తర్వులపై ట్రంప్ కోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు.