ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్కు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కృతజ్ఞతలు తెలిపారు. రుణ చెల్లింపుల్లో ఉపశమనాలు కల్పించిన నేపథ్యంలో ధన్యవాదాలు తెలుపుతూ.. ఇరుదేశాల మధ్య సత్సంబంధాల బలోపేతంతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరాలని ఆకాంక్షించారు. దేశ రుణ చెల్లింపులను సులభతరం చేస్తూ మాల్దీవుల ఆర్థిక సార్వభౌమత్వానికి ఇరుదేశాలు సహకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా డాలర్ల కొరత నేపథ్యంలో ఈ దేశాలతో ‘కరెన్సీ స్వాప్’ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు మొయిజ్జు వెల్లడించారు.
భారత్ – మాల్దీవుల మధ్య ఇటీవల సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్ నుంచి ఆ దేశానికి పర్యటకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో మొయిజ్జు నుంచి సానుకూల వ్యాఖ్యలు రావడం గమనార్హం. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికీ ఆయన హాజరైన విషయం తెలిసిందే.