మెక్సికోలో గత పదిహేను రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల గ్వాటెమాలా సరిహద్దు సమీపంలో చియాపాస్‌లోని హైవేపై వలసదారులు ప్రయాణిస్తున్న సరుకు రవాణా ట్రక్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది క్యూబా వలసదారులు మరణించారు. ఈ ప్రమాదం మరవకముందే తాజాగా మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
దక్షిణ మెక్సికోలో శుక్రవారం రోజున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులంతా వెనిజులా, హైతీకి చెందిన వలసదారులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో తొలుత 18 మంది మరణించారని అధికారులు భావించగా.. ఆ తర్వాత 16 మంది మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వెనిజులా నుంచి వచ్చిన మొత్తం 55 మంది వలసదారులు వాహనంలో ఉన్నారని వెల్లడించారు.