బంగ్లాదేశ్ లో గత కొద్ది రోజుల నుంచి కర్ప్యూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధాని హసీనా రాజీనామా చేసి భారత్ కి విచ్చేసింది. దీంతో నిన్న పార్లమెంట్ ను కూడా రద్దు చేశారు ప్రెసిడెంట్. రేపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది. గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆర్మీ చీప్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ తెలిపారు.
నోబెల్ అవార్డు గ్రహీత డా.మహమ్మద్ యూనుస్ రేపు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 15 మంది మంత్రులతో బంగ్లాదేశ్ కొత్త క్యాబినెట్ ఏర్పడనుంది. గురువారం రాత్రి 8 గంటలకు తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలిపారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ మధ్యంతర ప్రభుత్వానికి సారథ్యం వహించాలని మహమ్మద్ యూనుస్(84) ను ఎంపిక చేశారు. 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. 2006లో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు.