చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునగడంతో దాదాపు 90 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 130 మంది ఉన్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి పడవలో ప్రయాణించడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికార యంత్రాంగం తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్న పిల్లలు ఉన్నట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.
పడవ మునిగిన విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కలరా వ్యాప్తి అంటూ వదంతులు రావడంతో ప్రధాన ప్రాంతాల నుంచి ప్రజలు తప్పించుకొని దీవుల్లోకి వెళ్తుండగా ఈ పడవ మునిగిందని నాంపుల ప్రావిన్స్ సెక్రటరీ జైమ్ నెటో చెప్పారు. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన మొజాంబిక్‌లో గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 15,000 కలరా కేసులు నమోదయ్యాయి. మరో వైపు 32 మంది చనిపోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు పేర్కొన్నాయి.