కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్​ సయీద్​కు 78ఏళ్ల శిక్ష- పాక్​ జైల్లో ఉన్నట్లు వెల్లడించిన ఐక్యరాజ్య సమితి

-

2008 నవంబరు 26న ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన విషాదం వెనుక కీలక సూత్రధారి, కరుగుడుగట్టిన ఉగ్రవాది, జమాత్- ఉద్- దవా ఉగ్రసంస్థ అధినేత హఫీజ్ సయీద్‌ పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూరుస్తున్నాడని తేలడంతో పాకిస్థాన్ అతడికి 78 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పేర్కొంది. 7 కేసుల్లో దోషిగా తేలడం వల్ల శిక్ష విధించినట్లు వెల్లడించింది.

2008 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి-1267 ఆంక్షల కమిటీ హఫీజ్ సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. పాకిస్థాన్ ప్రభుత్వం నిర్బంధంలో ఉన్న అతడు, 2020 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి జైలు శిక్షను అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ తెలిపింది. గత నెలలో సెక్యూరిటీ కౌన్సిల్ కమిటీ అల్-ఖైదా ఆంక్షల జాబితాలోని వ్యక్తులు, సంస్థలపై కొన్ని రికార్డులకు సవరణలు చేసిన ఐరాస ఆంక్షల కమిటీ.. లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, సయీద్ డిప్యూటీ అయిన హఫీజ్ భుట్టావి మరణించినట్లు ధృవీకరణ జరిగిందని వెల్లడించింది. ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితాలో ఉన్న ఉగ్రవాది సయీద్‌ను తమకు అప్పగించాలని డిసెంబర్‌లో పాకిస్థాన్‌ను భారత్‌ కోరగా.. అందుకు పాక్‌ నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version