సరిహద్దులో నేపాల్ పోలీసులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బీహార్ లోని కిషన్‌గంజ్ ప్రాంతంలో ముగ్గురు భారతీయులపైకి నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీంతో వెంటనే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కిషన్‌గంజ్ ఎస్పీ తెలిపారు. ఈ నేపథ్యంలో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు కిషన్ గంజ్ ఎస్పీ తెలిపారు.
భారత్‌లో అంతర్భాగమైన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ నేపాల్ తమ దేశ మ్యాప్‌లో చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు భారతీయ న్యూస్ ఛానెళ్ల ప్రసారాలపైనా ఆంక్షలు విధించింది. అలాగే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇటీవల మాట్లాడుతూ.. అయోధ్య నేపాల్ లోనే ఉందని, శ్రీరాముడు కూడా నేపాల్‌లోనే పుట్టాడంటూ మరో వివాదానికి తెరతీశారు. అయితే ఇప్పుడు తాజా ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.