ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య కాల్పుల విరమణపై ఈజిప్టు రాజధాని కైరోలో కీలక చర్చలు ప్రారంభమవుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. కైరోలో ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా రఫాపై దండయాత్ర ఆగదని స్పష్టం చేశారు. అక్కడ ఉన్న హమాస్ బెటాలియన్లను నాశనం చేసే వరకు తాము వెనకడుగు వేసేదే లేదని అన్నారు. ఈ యుద్ధంలో సంపూర్ణ విజయమే తమ అంతిమ లక్ష్యమని తేల్చి చెప్పారు.
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు మంగళవారం రోజున సీనియర్ హమాస్ అధికారి ఖలీల్ అల్ హయ్యా సహా హమాస్ అధికారిక బృందం కైరోకు బయల్దేరింది. చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా.. ఒప్పందం వివరాలు బయటికి వెల్లడి కాలేదు. 40 మంది బందీలను విడుదల చేయాలన్న డిమాండు నుంచి వెనక్కి తగ్గి 33 మందిని విడిచిపెట్టినా సరిపోతుందని ఇజ్రాయెల్ పేర్కొన్నట్లు సమాచారం. హమాస్ చెరలో 100 మందికి పైగా బందీలు ఉన్నారు.