ఈ మధ్యకాలంలో వయస్సు తో సంబంధం లేకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో మధుమేహం కూడా ఒకటి. మధుమేహం సమస్య వలన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి మరియు వాటిని త్వరగా గుర్తించడం వలన ఎక్కువ ప్రమాదం ఉండదు. మధుమేహం సమస్యతో బాధపడేవారు అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం, విపరీతంగా దాహం అనిపించడం, పాదాలు, అరచేతులు మండుతున్నట్లు అనిపించడం వంటి మొదలైన లక్షణాలని ఎదుర్కొంటారు. వీటితో పాటుగా భుజాలు నొప్పిని కూడా ఎదుర్కొంటే మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాలి మరియు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
మధుమేహం సమస్యతో బాధపడేవారికి భుజం నొప్పి ఎక్కువ అవ్వడం వలన రోజువారి పనులను చేసుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైతే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ అవుతాయో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా భుజాలలో దృఢత్వం ఎంతో తగ్గిపోతుంది. దీంతో పాటుగా మధుమేహం సమస్య ఉన్న వారిలో కండర ద్రవ్యరాశి ఎంతో తగ్గుతుంది. దానివలన భుజాల ద్రుడత్వం తో పాటుగా కదలికల పై కూడా ఎంతో ప్రభావం ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయో డాక్టర్ ను తప్పకుండా సంప్రదించాలి. ఈ విధంగా భుజాల కండరాల నొప్పి తీవ్రంగా మారకుండా ముందుగానే చూసుకోవడం వలన ఎన్నో ఇబ్బందులకు దూరంగా ఉండవచ్చు.
మధుమేహంతో బాధపడేవారిలో కొలాజెన్ జిగటగా మారుతుంది. దీంతో కదలికలు చెయ్యడానికి కష్టం అవుతుంది. అదేవిధంగా భుజాలు నొప్పితో పాటుగా మధుమేహం ఉన్నవారికి క్యాప్సులర్ ఫైబ్రోసిస్ సమస్య కూడా ఎదురవుతుంది. దీనివలన భుజం కదిపినా ఎంతో తీవ్రమైన నొప్పిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా రోజు వారి పనులకు కూడా అంతరాయం కలుగుతుంది. కనుక భుజం నొప్పి వచ్చినప్పుడు తేలికగా అస్సలు తీసుకోకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించి తగిన మెడికేషన్ ను తీసుకోవాలి. ఈ విధంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన సమస్య తీవ్రత ఎక్కువ అవ్వకుండా ఉంటుంది.