పాపువా న్యూగినీలో కొండచరియలు విరిగి పడిన మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ ఘటనలో సజీవ సమాధి అయిన వారి సంఖ్య భారీగా పెరిగి రెండు వేలకు చేరింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం ఐరాసకు వెల్లడించింది. ‘కొండచరియలు విరిగి పడిన ఘటనలో 2,000 మంది ప్రజలు సజీవ సమాధి అయ్యారని ఆ దేశంలోని నేషనల్ డిజాస్టర్ సెంటర్‌నుంచి ఐరాస ఆఫీస్‌కు సమాచారం వెళ్లింది. దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది.
ఇప్పటికీ చాలా చోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో.. శిథిలాల కిందే ఉండిపోయిన క్షతగాత్రుల ప్రాణాలకు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలకు సవాల్‌గా మారింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సైన్యం, ఇతర బృందాలను కూడా సిద్ధం చేస్తున్నారు. మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్ సెంటర్ ద్వారా సమన్వయం చేసుకొంటామని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. శుక్రవారం (ఈనెల 24వ తేదీ) తెల్లవారుజామున ఈ దేశంలోని ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై మౌంట్ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దెబ్బకు ఆ ప్రావిన్స్‌లో చాలా ప్రాంతాలు తుడిచి పెట్టుకుపోయిన విషయం తెలిసిందే.