ఎట్టకేలకు పారిస్ ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. సంచలనాలు, రికార్డులు, పలు వివాదాలతో 2024 ఒలింపిక్స్ గేమ్స్కు శుభం కార్డు పడింది. రెండు వారాల పాటు ఈ క్రీడలు జరిగాయి. సెన్ నది వేదికగా ఈ నెల 26న అధికారికంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్, వివిధ పోటీల ద్వారా క్రీడాభిమానులను అలరించి ఆగస్టు 11తో ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 12.30 గంటలకు ఈ ఒలింపిక్స్ క్లోజింగ్ సెరిమనీ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో భారత పతాకధారులుగా షూటర్ మను బాకర్, అలాగే హాకీ స్టార్ ప్లేయర్ శ్రీజేష్ వ్యవహరించారు.
ఒలింపిక్స్ చివరి రోజున బాస్కెట్‌బాల్, సైక్లింగ్ ట్రాక్, అథ్లెటిక్స్ (మహిళల మారథాన్), హ్యాండ్‌బాల్, మోడర్న్ పెంటథ్లాన్, వాలీబాల్, వాటర్ పోలో, రెజ్లింగ్,వెయిట్‌లిఫ్టింగ్లో పోటీలు జరిగాయి. మరోవైపు పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పోరాటం ఆరు పతకాలతో ముగిసింది. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకాలున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో షూటర్ మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించింది. భారత హాకీ జట్టు ఈ సారి కాంస్యం, షూటర్ స్వప్నిల్ కుశాలె 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్యం, రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్యం, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించారు.