బ్రిటన్ ప్రధాని ఎన్నికలో విజయం సాధించిన లిజ్ ట్రస్ బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్కాట్లాండ్ లోని బాల్మోరల్ క్యాజిల్ లో ఉన్న రాణి ఎలిజబెత్ తో లిజ్ ట్రస్ భేటీ అయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా విజయం సాధించిన లిజ్ ట్రస్‌ను బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా రాణి ఎలిజబెత్ నియమించారు.
బ్రిటన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాణి ఎలిజబెత్ సూచించడంతో అందుకు ట్రస్ అంగీకరించారు. అంతకుముందు క్వీన్‌ను కలిసిన బోరిస్ జాన్సన్.. తన రాజీనామాను అందజేశారు. అధికార కన్జర్వేటివ్ పార్టీలో అంతర్గతంగా చేపట్టిన నాయకత్వ ఎన్నికలో విదేశాంగమంత్రిగా ఉన్న లిజ్ ట్రస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌పై సుమారు 21 వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీంతో 47 ఏళ్ల లిజ్ ట్రస్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది.