అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతి వివేక్ రామస్వామికి సూపర్ క్రేజ్ దక్కుతోంది. ప్రజాదరణలో వివేక్ అనూహ్యంగా దూసుకుపోతున్నారు. మరోవైపు పలువురు ప్రముఖులు కూడా వివేక్ కు మద్దతిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ వివేక్ హవా జోరుగా కొనసాగుతోంది.
గురువారం రోజున రిపబ్లికన్‌పార్టీ చర్చ ముగిసిన గంటలోనే ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా అమెరికన్లు 4.5లక్షల డాలర్ల విరాళాలు గుప్పించారు. దీన్నిబట్టి ఆయన వాగ్దాటి.. ఎంతగా మంత్రముగ్ధులను చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ఆయన ప్రస్తుతం అమెరికా ఒపీనియన్ పోల్స్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్ డిశాంటిస్‌ల తర్వాతి స్థానంలో ఉన్నారు.
రిపబ్లిక్ పార్టీ షోలా కాకుండా వివేక్ రామస్వామి షోలా ఉందని ఎన్‌బీసీ వార్తాసంస్థ వ్యాఖ్యానించింది. చర్చ అనంతరం జరిగిన సర్వేలో 28 శాతం మంది రామస్వామి ప్రదర్శన అత్యుత్తమం అనగా… 27 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్‌కు మద్దతుగా నిలిచారు.