దేశ జనాభా విపరీతంగా పెరిగిపోతోందని కొన్ని దేశాలు ఆందోళన చెందుతోంటే.. జనాభా తగ్గుతోందని మరికొన్ని దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ముఖ్యంగా యువ జనాభా తక్కువగా ఉండటంతో ఆ శాతం పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి కొన్ని దేశాలు. ఈ క్రమంలో దేశ జనాభాను పెంచేందుకు మహిళలు ఎక్కువమంది పిల్లలను కనాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా కీలక కామెంట్స్ చేశారు. ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని.. దేశానికి పెద్ద కుటుంబాలను ఇవ్వాలని ఆ దేశ మహిళలను కోరారు.
“1990 నుంచి రష్యాలో జననాల రేటు పడిపోయింది. ఇక ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి భారీగా ప్రాణనష్టం జరిగింది. రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. మన అమ్మమ్మలు, నానమ్మలకు ఎనిమిది మంది పిల్లలు ఉండేవారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సంప్రదాయాన్ని మనం కాపాడుకుందాం. పెద్ద కుటుంబాలు దేశంలో ప్రామాణికంగా మారాలి. భవిష్యత్తు తరాలు రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇది రష్యాని ప్రపంచంలో బలమైన దేశంగా నిలబెడుతుంది’’ అని పుతిన్ అన్నారు.