రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) త్వరలో మనదేశంలో పర్యటించనున్నారు. భారత్ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మోదీ ఆహ్వానాన్ని మన్నించిన పుతిన్ ఈ పర్యటనకు అంగీకరించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. ‘‘రష్యా అండ్ ఇండియా: టువర్డ్ ఏ బైలాటరల్ అజెండా’’ పేరుతో రష్యన్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కౌన్సిల్ (RIAC) నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఈ పర్యటన కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ .. తొలి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా మొదట రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. మోదీ పర్యటనను గుర్తు చేసిన లావ్రోవ్.. ఇప్పుడు తమ వంతు వచ్చిందని వ్యాఖ్యానించారు. అయితే, పర్యటన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రధాని మోదీ గతేడాది జులైలో రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా భారత్‌కు రావాలని పుతిన్‌ను మోదీ ఆహ్వానించగా తాజాగా ఆయన అంగీకరించినట్లు రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది.