లండన్ నుంచి సింగపూర్‌కు విమానం బయల్దేరిన విమానం మరికొద్ది గంటల్లో గమ్యస్థానం చేరుతుందనగా ఆకాశంలో ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఆ సమయంలో 37 వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం.. కేవలం ఐదే ఐదు నిమిషాల్లో 31 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా 6 వేల అడుగులు కిందకు దిగిందని ఫ్లైట్ రాడార్ 24 డేటాను బట్టి తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు ప్రయాణికులు, విమాన సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
అసలేం జరిగిందంటే..?
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (SQ321) మే 20న మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో లండన్ నుంచి సింగపూర్‌కు బయల్దేరగా.. మార్గమధ్యలో విమానం తీవ్ర కుదుపులకు లోనుకావడంతో దాన్ని బ్యాంకాక్‌లోని విమానాశ్రయానికి మళ్లించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. కుదుపుల సమయంలో విమానంలో భయానక వాతావరణం నెలకొంది. విమానంలోని ఓవర్ హెడ్ బిన్స్, దుప్పట్లు, ఇతర వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. మాస్కులు, లైటింగ్, ఫ్యాన్ ప్యానెల్స్ సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాయి. మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.