యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు షాకింగ్ న్యూస్. బ్రిటిష్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే భారతీయులతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు వీసా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక నుంచి విద్యార్థి వీసాపై వారి కుటుంబ సభ్యులను తీసుకురావడం కుదరదని ఆ దేశ సర్కార్ తెగేసి చెప్పేసింది. అయితే పోస్టుగ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోర్సులతో పాటు ప్రభుత్వ స్కాలర్‌షిప్ కోర్సులు చేసే వారికి మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది. వలసల నియంత్రణలో భాగంగా తీసుకువచ్చిన ఈ కఠిన నిబంధనలు నేటి నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
భారీ సంఖ్యలో వస్తున్న వలసలను తగ్గిస్తామని బ్రిటన్ పౌరులకు ఇచ్చిన మాటపై అక్కడి సర్కార్ నిబద్ధతను చాటుకుంటోంది. సరిహద్దులను నియంత్రించడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను రక్షించుకునే చర్యలు ఈ ఏడాది మొత్తం ఉంటాయని బ్రిటన్ హోంశాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ తెలిపారు ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే విద్యార్థులు వారి కుటుంబీకులను తీసుకువచ్చే అసమంజన చర్యలకు నేటితో ముగింపు పడిందని వెల్లడించారు. దీని ద్వారా వేల సంఖ్యలో వలసలు తగ్గుతాయని ఇలా దాదాపు 3లక్షల మందిని నిరోధించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నామని క్లెవర్లీ చెప్పుకొచ్చారు.