రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. బుధవారం రోజున ఏకంగా ఆరు ప్రాంతాలపై గురిపెట్టింది. ఈ దాడిలో పిస్కోవ్ నగర విమానాశ్రయంలోని నాలుగు ఐఐ-76 సైనిక రవాణా విమానాలకు నష్టం వాటిల్లింది. విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి.
విమాన రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత తమపై కీవ్ చేసిన అది పెద్ద దాడి ఇదేనని మాస్కో పేర్కొంది. పిస్కోవ్‌తో పాటు ఓరియోల్, బ్రయాన్స్క్ రియాజాన్, కలుగా, మాస్కో ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్‌లు దాడికి దిగాయని వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ ఈ యుద్ధం రష్యా వైపు మళ్లిందని ఇంతకుముందే పేర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు.. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ మరణంపై బుధవారం రష్యా ఆసక్తికరంగా స్పందించింది. ఇప్పటివరకు ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంపై తమకు ఎలాంటి సంబంధం లేదన్న మాస్కో.. అది ఉద్దేశపూర్వకంగా చేసిందేమోనంటూ వ్యాఖ్యానించింది.