గాజాకు అండగా అమెరికా.. రూ.832కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించిన బైడెన్

-

ఇజ్రాయెల్, హమాస్​ల మధ్య యుద్ధం తీవ్రంగా మారింది. ఓవైపు ఇజ్రాయెల్​పై హమాస్ తీవ్ర దాడులకు తెగబడుతోంటే.. మరోవైపు హమాస్​ను సమూలంగా నాశనం చేసేందుకు ప్రతిన పూనిన ఇజ్రాయెల్ గాజాపై విరుచుకు పడుతోంది. ఇజ్రాయెల్‌ సైన్యం-హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర పోరుతో గాజా ప్రాంతంలో బీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు తినడానికి తిండి, తాగేందుకు నీరు సైతం లేక గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో తీవ్ర మానవతా సంక్షోభం తలెత్తింది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఓ కీలక ప్రకటన చేశారు. మానవతా దృక్పథంతో గాజా, వెస్ట్‌బ్యాంక్‌కు 100 మిలియన్‌ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహుతో భేటీ తర్వాత.. బైడెన్‌ ఈ ప్రకటన చేశారు.  ఇజ్రాయెల్​- హమాస్​ మధ్య భీకర పోరు నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన 10 లక్షల మందికి పైగా ప్రజలకు, యుద్ధ ప్రభావిత పాలస్తీనియన్లకు ఈ సాయం ఉపయోగపడుతుందని బైడెన్ వెల్లడించారు.

“నేను ఒక సందేశంతోనే ఇజ్రాయెల్‌కు వెళ్లాను. ఆ దేశం ఒంటరి కాదు. అమెరికా ఉన్నంత కాలం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతాం. మెజారిటీ పాలస్తీనా ప్రజలకు హమాస్‌తో అసలు సంబంధం లేదు. గాజా ఆస్పత్రిపై జరిగిన దాడికి కారణం ఇజ్రాయెల్​ సైన్యం కాదని తెలుస్తోంది” అని బైడెన్ ట్వీట్​లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version