‘ఖలిస్థానీ’ అంశంలో భారత్‌పై కెనడాప్రధాని జస్టిన్ ట్రూడో చేస్తోన్న వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరుగుతూ ఉందే తప్ప తగ్గడం లేదు. ట్రూడో భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చుతున్నారు. అయితే ఈ రెండు దేశాల వివాదంపై అగ్రరాజ్యం వైఖరి ఏంటో మాత్రం ఇప్పటివరకు అర్థం కాకుండా ఉంది. అయితే ఈ సమయంలో రెండు మిత్ర దేశాల విషయంలో అమెరికా మొగ్గు ఎటువైపు ఉంటుందనే ప్రశ్నలకు తాజాగా పెంటాగన్ మాజీ అధికారి మైఖెల్ రూబిన్ సమాధానమిచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..?
రెండు మిత్రదేశాల విషయంలో అమెరికా ఒకరికి మద్దతుగా నిలవకపోవచ్చునని మైఖెల్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ అలా ఎంచుకోవాల్సి వస్తే.. ప్రస్తుత వ్యవహారంలో అమెరికా మొగ్గు భారత్ వైపే ఉంటుందని తెలిపారు. ఎందుకంటే నిజ్జర్ ఒక ఉగ్రవాది అని.. అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైందని.. ఈ రెండు దేశాల బంధం చాలా ముఖ్యమైందని అన్నారు.
మరోవైపు కెనడా ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని మైఖెల్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో అమెరికా తన బంధాన్ని పునర్నిర్మించుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘర్షణ భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదమని మైఖెల్ చెప్పుకొచ్చారు.