హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రాలలో కేదార నాథ్ ఆలయం ఒకటి. శివుని యొక్క శాశ్వత నివాస స్థలం హిమాలయాలలో ఉంది. కేదార్ నాథ్ క్షేత్రం జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయానికి గొప్ప వారసత్వ చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుటకు పాదయాత్ర చేయవలెను. సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఈ స్వామి దర్శనం లభిస్తుంది.
కేదార్ నాథ్ గుడి శైవుల పుణ్యక్షేత్రం. మందాకినీ నది తీరాన ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో రుద్రా ప్రయాగ జిల్లాలో గర్హాన్ పర్వత శ్రేణుల పై భాగంలో ఉంది. ఈ ఆలయాన్ని దర్శించాలంటే కొంత దూరం పాదయాత్ర చేయాలి. నడవలేని వారిని గుర్రాలమీద తీసుకు వెళ్తారు . ఈ గుడిని ఆది శంకరాచార్యుల వారు నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ లింగం యొక్క వెనుక భాగం లో ఆది శంకరాచార్యుల వారి సమాధి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఉత్తరా ఖండ్ చార్ ధాం క్షేత్రాలలో కేదార్ నాథ్ ఆలయం ఒకటి. ఇక్కడ శివుని యొక్క సగ భాగం మాత్రమే ఉంటుంది. తల భాగం నేపాల్ లోని ఖాట్మండ్ లో ఉన్న పశుపతి ఆలయం లో ఉంది.
వృక్షాల తో కూడిన పచ్చని పర్వతాలు, జలపాతాలు మద్య కాలినడకన ఈ ఆలయ దర్శనం ఆద్యంతం కొత్త అనుభూతిని మిగులుస్తుంది. కేదార నాథ్ గర్భ గుడిలో అందరు అనుకున్నట్టు శివ లింగం ఉండదు. ఎద్దు యొక్క వెనుక భాగంగా కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత పంచ పాండవులు తమ పాతకాలను పోగొట్టుకోవడానికి ద్రౌపది తో కలిసి ఇక్కడ స్వామిని పూజించినట్టు కథనం. దీనికి ఆధారంగా ఇక్కడ శ్రీకృష్ణుడు, కుంతి, ద్రౌపది, పాండవుల విగ్రహాలను కూడా దర్శనం చేసుకోవచ్చు.