కేరళలోని ప్రసిద్ధి గాంచిన దేవాలయం శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రం. ఈ స్వామిని హిందువులు హరిహర సుతుడిగా కొలుస్తారు. ఇది కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతంలో ఉంది. ఇక్కడ యాత్రలు నవంబరులో ప్రారంభమయి జనవరిలో ముగుస్తాయి. జనవరి 14 న మకర జ్యోతి దర్శనం మనకు కనిపిస్తుంది.
1907లో గర్భ గుడి ఎండు గడ్డితో, ఆకులతో కప్పబడి ఉండేది. అప్పట్లో ఏక శిలావిగ్రహానికి పూజలు చేసేవారు. రెండు వందల సంవత్సరాల క్రితం ఈ గుడికి 70 మంది భక్తులు వెళ్ళారని ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలు వచ్చింది అని రికార్డుల్లో తెలుస్తుంది. 1909 వ సంవత్సరంలో ఈ ఆలయాన్నిపునర్నిర్మించారు. ఇక అప్పుడు శిలా విగ్రహం స్థానంలో పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి స్వామి వారి ఆభరణాలు మూడు పెట్టెలలో, మూడు రోజులపాటు నడిచి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమలకు తీసుకువస్తారు.
వాటిని స్వామి వారికి అలంకరించి గుడిలో కర్పూర హారతి ఇవ్వగానే తూర్పు వైపున ఉన్న పొన్నంబలమేడులో మకర జ్యోతి దర్శనం భక్తులకు కనపడుతుంది. ఆలయ పునర్నిర్మాణం జరిగిన తరువాత కూడా రాతి మెట్ల నే వాడేవారు. మెట్లు ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుకి కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఎక్కడం కష్టంగా మారింది. ఇది గమనించిన ఆలయ కమిటి వారు పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రం తంత్రాలతో కప్పేశారు. 2000వ సంవత్సరంలో బెంగుళూరుకి చెందిన ఒక భక్తుడు గర్భ గుడి పైన దాని చుట్టూ బంగారు రేకులు తాపడం చేయటానికి పూనుకోవడంతో శబరిమల ఆలయం స్వర్ణ దేవాలయం గా మారింది.