కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ కొనసాగుతుండంతో.. పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు సైతం తమ వివాహలను వాయిదా వేసుకుంటున్నారు. అయితే కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మాత్రం తన కుమారుడు, నటుడు నిఖిల్ వివాహం ముందుగా అనుకున్నట్టుగానే ఏప్రిల్ 17వ తేదీనే జరుగుతుందని స్పష్టం చేశారు.
అయితే తొలుత అంగరంగ వైభవంగా వివాహం జరిపించాలని అనుకున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సింపుల్ పెళ్లి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ పెళ్లికి వధూవరుల కుటుంబాల నుంచి కేవలం 15–20 మంది మాత్రం హాజరుకానున్నారు. బెంగళూరులోని కుమారస్వామి ఇంటిలోనే ఈ పెళ్లి జరుగనుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం క్రిష్ణప్ప సోదరుడు మంజునాథ్ మనవరాలు రేవతితో నిఖిల్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా, నాలుగేళ్ల క్రితం జాగ్వార్ సినిమాతో నిఖిల్ టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. గతేడాది జరిగిన ఎన్నికలలో మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలతా అంబరీష్ చేతిలో ఓటమి పాలయ్యారు.