రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం.. మరో రూ.3 వేల కోట్లు పెట్టనున్న అంతర్జాతీయ సంస్థలు

-

తెలంగాణలో రూ.3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు భారతీ ఎయిర్​టెల్, యూరోఫిన్స్ సైంటిఫిక్ సంస్థలు ముందుకొచ్చాయి. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తమ నిర్ణయాన్ని వెల్లడించాయి. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.2 వేల కోట్లతో హైదరాబాద్‌లో హైపర్‌ స్కేల్‌ డేటా కేంద్రం ఏర్పాటుకు అంగీకరించగా.. ఫ్రాన్స్‌కు చెందిన యూరోఫిన్స్‌ సైంటిఫిక్‌ సంస్థ రూ. వెయ్యి కోట్లతో జీనోమ్‌వ్యాలీలోని తమ జీవశాస్త్ర ప్రాంగణాన్ని విస్తరిస్తామని తెలిపింది.

తెలంగాణ పెవిలియన్‌లో భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌, ఎండీ రాజన్‌ భారతీ మిత్తల్‌లు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రూ.2 వేల కోట్లతో భారత్‌లోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్‌ హైపర్‌ స్కేల్‌ డేటా కేంద్రం స్థాపిస్తామని వారు తెలిపారు. 60 మెగావాట్ల సామర్థ్యంతో డేటా స్టోరేజ్‌, విశ్లేషణ, డేటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డేటా కేంద్రం రాబోయే 5-7 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని సునీల్‌ మిత్తల్‌ పేర్కొన్నారు. దీనిద్వారా 2 వేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.

 

జీనోమ్‌వ్యాలీలోని తమ ప్రాంగణాన్ని రూ.వెయ్యి కోట్లతో విస్తరించి, అత్యాధునిక ప్రయోగశాలను ఏర్పాటు చేస్తామని యూరోఫిన్స్‌ సంస్థ సీఈవో మార్టిన్‌ గిల్లిస్‌ అన్నారు. ‘‘భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన ఔషధ, బయోటెక్‌ సంస్థలకు ఉత్పాదక, సింథటిక్‌, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, అనలిటికల్‌, ఫార్మకాలజీ, టాక్సికాలజీ సేవలందిస్తాం. కొత్త ప్రాంగణం 90 వేల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఇందులో 1500 మందికి ఉపాధి కల్పిస్తాం. ఈ ప్రాంగణం ఔషధరంగ అభివృద్ధి, ఆవిష్కరణలకు ఊతమిస్తుంది’’ అని సీఈవో మార్టిన్‌ గిల్లిస్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version