ఐపీఎల్ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కి చేరింది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో అదరగొట్టిన ముంబై మరోసారి IPL ఫైనల్‌కు చేరింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో రెచ్చిపోయి ఆడిన ముంబై… ఢిల్లీని 57 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, పొలార్డ్ వంటి సీనియర్లు విఫలమైనా కుర్రాళ్లు అదరగొట్టారు. ఓపెనర్ డికాక్ 40 రన్స్ చేయగా… ఇషాన్, సూర్యకుమార్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో పాండ్యా 14 బంతుల్లోనే 37 రన్స్ బాదేశాడు.
201 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన ఢిల్లీకి… ఆరంభంలోనే ఓటమి దాదాపు ఖరారైంది. ఒక్క పరుగు కూడా చేయకుండానే… ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్ ఔట్ కావడంతో… ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. పృథ్వీషా, అజింక్య రహానె, శిఖర్ ధావన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పంత్ కూడా తేలిపోయారు. స్టాయినీస్ 65 రన్స్, అక్షర్ పటేల్ 42 పరుగులు చేసి పోరాడుతున్నట్లు కనిపించినా… అప్పటికే రన్‌రేట్ భారీగా పెరిగిపోవడంతో… ఢిల్లీ ఓటమి ఖరారైపోయింది. చివరికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేయగలిగింది.
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా కొత్త రికార్డులు నమోదయ్యాయి. IPLలో ఓ జట్టు సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఢిల్లీ ఆ చెత్త రికార్డ్ నెలకొల్పింది. ఇక ముంబై మొదట బ్యాటింగ్‌కు దిగి 200 రన్స్ చేసిన ప్రతీసారీ ఆ టీమ్ గెలిచింది. ఇలా ముంబై మొత్తం 11 మ్యాచ్‌లు గెలిచింది.