సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 13 ఎడిషన్ కు గాను స్టార్ టీవీ ప్రస్తుతం ఇతర టీవీ చానళ్లలో, మీడియాలో ప్రచార కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ‘ఆయేంగే హమ్ వాపస్’ పేరిట ఈ ఎడిషన్ ఐపీఎల్‌కు గాను ఓ ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. దాన్ని ప్రణవ్ అజయ్‌రావు మల్పె కంపోజ్ చేశాడు. అయితే ఆ గీతం ట్రాక్ ను తన పాట నుంచి కాపీ చేశారని ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపించాడు.
2017లో ‘దేఖ్ కౌన్ ఆయా వాపస్’ అనే పాటను తాను రూపొందించానని, దాన్ని కాపీ చేసి కొత్త ఐపీఎల్ గీతాన్ని కంపోజ్ చేశారని ర్యాపర్ కృష్ణ కౌల్ ఆరోపించాడు. దీంతో ఐపీఎల్ యాజమాన్యంపై ట్విట్టర్‌లో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఓ సింగర్ పాటను కాపీ చేస్తారా ? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మ్యూజిక్ కంపోజర్ మల్పె మాత్రం తాను ఆ పాటను కాపీ చేయలేదని, తాను, తన టీం ఎంతో కష్టపడి అహోరాత్రులు శ్రమించి ఐపీఎల్ గీతాన్ని కంపోజ్ చేశామని అంటున్నాడు.
ఇక మ్యూజిక్ కంపోజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంసీఏఐ) తనకు ఐపీఎల్ గీతానికి సంబంధించి ఓ సర్టిఫికెట్‌ను కూడా ఇచ్చిందని, అందువల్ల ఆ గీతం తన సొంతమని, ఎవరి పాటనూ కాపీ చేయలేదని మల్పె తెలిపాడు. కాగా ఈ విషయంపై తన లీగల్ టీం చర్చిస్తోందని కృష్ణకౌల్ తెలిపాడు. అయితే నెటిజన్లు మాత్రం ఐపీఎల్ యాజమాన్యంపై దుమ్మెత్తి పోస్తున్నారు. కృష్ణకౌల్‌కు వారు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు #IplAnthemCopied అనే హ్యాష్ ట్యాగ్‌ను విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నారు.