తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఫార్ములా – ఈ కార్ రేసింగ్ లో ఏ-1 గా చేర్చారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ని ఏ-2 గా ఏసీబీ పేర్కొంది. కేటీఆర్ పై నాన్ బేలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కేటీఆర్ పై కేసు నమోదు అయిన నేపథ్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ( బీఆర్ఎస్ కార్యాలయం) వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
దీంతో బిఆర్ఎస్ నాయకులు మన్నె క్రిశాంక్ తో పాటు మరికొంతమంది నేతలు పోలీసుల వద్దకు వెళ్లి కార్యాలయంలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అయితే తమకు ఉన్నతాధికారులు డ్యూటీ వేసిన కారణంగా ఇక్కడికి వచ్చామని పోలీసులు సమాధానం చెప్పారు. ఇక ఫార్ములా – ఈ కార్ రేస్ కేసుని విచారించేందుకు ఏసీబీ ప్రత్యేక టీం ని ఏర్పాటు చేసింది.
బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసులో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ అధికారులతో సమావేశమై చర్చిస్తున్నారు. ఈ కేసుని ఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపించే అవకాశం ఉంది. ఇక ఈ కేసు నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారని సమాచారం. ఈ మీడియా సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడతారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.