మొన్నటివరకు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్-బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు వార్ నడిచిన విషయం తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ని ఓడించడం, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సత్తా చాటడంతో బీజేపీ ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో హైలైట్ అయింది. ఇక బీజేపీనే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని ప్రచారం నడిచింది. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకున్నాయి.
అయితే కాంగ్రెస్ సైలెంట్‌గా ఉండటంతోనే బీజేపీ హైలైట్ అయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు టీపీసీసీ పగ్గాలు చేపట్టాక రేవంత్ రెడ్డి మరింత దూకుడుగా ముందుకెళుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే కేసీఆర్‌ని గద్దె నుంచి దింపుతామని చెబుతున్నారు. ఇక వెంటవెంటనే ఇతర పార్టీ నాయకులని కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సొంత పార్టీని చాలా వరకు లైన్‌లో పెట్టేశారు.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ముందుకెళుతున్నారు. అంటే ఒకేసారి టీఆర్ఎస్, బీజేపీలని రేవంత్ టార్గెట్ చేసేశారు. కానీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారుగానీ, ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో వెనుకబడి ఉన్నారు.
అయితే పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన కారణంగా ఉన్నాయి. అందుకే సంజయ్, ఈ అంశంపై పోరాటం చేయలేకపోయారు. ఇదే రేవంత్‌కు ప్లస్ అవుతుందని అంటున్నారు. రాష్ట్రం, కేంద్రంలో కాంగ్రెస్‌నే ప్రతిపక్షంగా ఉంది. అందుకే ఆ పార్టీ పోరాటాన్ని ఉదృతి చేసింది. రేవంత్ అదే ఆయుధాన్ని పెట్టుకుని రెండు పార్టీలపై యుద్ధం చేస్తున్నారు. ఈ అంశం రేవంత్‌కు కలిసొస్తుందేమో చూడాలి.