ఓ పేపర్ ను నిషేధిస్తే ఏం కాదు? ఓ ఛానెల్ ను నిషేధించి సాధించేదేమీ ఉండదు? అంటే ఇప్పుడు ఈనాడు పత్రిక ఉద్యోగుల భజన చేస్తుందా ఏంటి? ఎవ్వరయినా ఉన్నది ఉన్నట్లే రాయాలి. హద్దులు దాటకూడదు. ప్రభుత్వం తరఫున ఈనాడును జగన్ నిషేధిస్తే, ఉద్యోగుల తరఫున సాక్షిని బండి శ్రీను నిషేధిస్తారా? అంటే నిషేధించినంత మాత్రాన ఉద్యోగుల సమస్యలు సమసి పోతాయా?
ఒక్కసారి ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నామో అన్నది.. ఆ పాటి ఇంగితం లేకుండా మాట్లాడితే ఎవ్వరూ ఏం చేయలేం గాక చేయలేం.
ఉద్యోగులు ఇవాళ నిరసనలు తెలుపుతూ తెగ ఉత్సాహం చూపుతున్న వేళ మరో వివాదం ఒకటి తెరపైకి వచ్చింది.పీఆర్సీ మాటెలా ఉన్నా తమ వాదన వినిపించడంలో విఫలం అవుతున్న సాక్షి మీడియాను బ్యాన్ చేయాలని ఉద్యోగ సంఘాలు యోచన చేస్తున్నాయి. ఇంతకూ సాక్షి నిషేధం ఎందుకు? అసలీ ఆలోచన వల్ల ఉద్యోగికి కలిగే ప్రయోజనం ఏంటి అన్నది చూద్దాం.
ఓ పత్రికను కానీ ఓ ఛానెల్ ను కానీ ఎందుకు బ్యాన్ చేయాలి. ఇవాళ ఉద్యోగుల సమస్యలు చెప్పడంలో విఫలం అవుతున్నారన్నదే ప్రధాన కారణమా? లేదా అదొక ముఖ్యమంత్రి పత్రిక కనుక నిషేధిస్తే చాలు అన్న పైశాచిక ఆనందమా? ఈ రెండు ప్రశ్నలకూ ఉ ద్యోగులు ముందుగా ఎవరికి వారు సమాధానాలు వెతకాలి. సాక్షి పేపర్ నిజంగానే అబద్ధాలు రాస్తుందా? అయితే నిజాలేంటి.. వాటి గురించి ఉద్యోగులు ఎందుకు మాట్లాడరు. అంటే సాక్షి పత్రిక ఉద్యోగుల భజన చేయాలా ఏంటి? అలా చేయని రోజు ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీను నేతృత్వంలో సాక్షి పత్రిక కాపీలను తగులపెట్టాలని అనుకుంటున్నారా?
అసలీ నిరసనలు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఒక్కటంటే ఒక్క కారణం సహేతుకంగా ఉందా.. పీఆర్సీ ఇప్పటికిప్పుడు ఇవ్వలేను అన్నప్పుడు జగన్ పై ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఉద్యోగులే..ఆ తరువాత వద్దంటున్నది ఉద్యోగులే! పోనీ ఉద్యోగులంతా బాగా పనిచేస్తున్నారు కనుక వారి గొంతెమ్మ కోర్కెలు తీరుద్దాం అనుకుందాం..మరి! ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కథేంటి? పాపం వాళ్లకు ఇవాళ్టికీ జీతాలు సరిగా అందడం లేదే! అప్పుడు నోరెందుకు లేవలేదు.
జెడ్పీలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు పది నెలలుగా జీతాలే లేవు. అప్పుడు ఎందుకు ఉద్యోగ సంఘాల నాయకులు లీవు పెట్టి మరీ ఉద్యమించలేదు. అంతెందుకు ఐదు వేలు జీతంతో ఓ వలంటీరు పనిచేస్తున్నాడు. మరి! ఆయన కన్నా నీఛంగా ఇవాళ ఉద్యోగులు ఉన్నారా.. మరీ అంత అథమ స్థాయిలో వీళ్ల ఆర్థిక స్థితిగతులు ఉన్నాయా? ఒక సఫాయి కార్మికుడికి ఇవాళ పదివేలు జీతం పదో తారీఖున చెల్లిస్తున్న పంచాయతీలు ఎన్నో ఉన్నాయి.
ఒకటో తారీఖున జీతం ఇవ్వకపోతే ఇక ఆ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అయిపోతుంది కదూ! ఇదే నా ఈ నాయకులు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న సందేశం? మాట్లాడండి కానీ దిగజారకండి.. మరీ! అంత దరిద్రాతి దరిద్రంగా మాట్లాడడం అస్సలు చేయకండి ఇదొక్కటే ఉద్యోగ సంఘాల నాయకులకు విన్నపం.