నోరు అదుపులో పెట్టుకోకుంటే.. వేటు తప్పదు.. జాగ్రత్త-అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డిని వైసీపీ అధినేత సీఎం జగన్ హెచ్చరించారా? ఆయన వైఖరిపైసీఎం జగన్ గుస్సాగా ఉన్నారా? కొన్నాళ్ల కిందట మంత్రి కొడాలి నాని… ఇప్పుడు ద్వారంపూడికి నేరుగా జగన్ క్లాస్ ఇచ్చారా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం కాకినాడ సహా తూర్పుగోదావరి జిల్లా నాయకుల్లోనూ జగన్ హెచ్చరికలపైనే చర్చ సాగుతున్నట్టు తెలిసింది. పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగామంటే.. వినయం, విధేయతలు, విశ్వసనీయతతోనేనని జగన్ తన పార్టీ నాయకులకు మరోసారి నూరి పోశారట.
విషయంలోకి వెళ్తే.. రాజధాని ఆందోళనలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ సహా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధార ణమేనని అందరూ సరిపెట్టుకున్నారు. అయితే, జగన్‌తో వ్యక్తిగత సంబంధాలు సహా వ్యాపార సంబంధా లు కూడా ఉన్న ద్వారంపూడి మాత్రం సహించలేక పోయారు. మూడు రాజధానులను స్వాగతిస్తూ.. కాకినా డలో నిర్వహించిన ర్యాలీలో ఆయన నోరు పారేసుకున్నారు.
చంద్రబాబును ఇప్పటి వరకు ఎవరూ అనని విధంగా పరుషంగా దూషించారు. వాస్తవానికి టీడీపీ ఈ వ్యాఖ్యలను అడ్డు పెట్టుకుని వైసీపీపై రెచ్చిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ, ద్వారం పూడి వ్యాఖ్యలపై బహిరంగ విమర్శలకు దూరంగా ఉన్న చంద్రబాబు టీం.. ఈ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి.. వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతల వ్యవహార శైలిని తీవ్రస్థా యిలో దుయ్యబట్టింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో వైసీపీపై వ్యతిరేక కామెంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి.
మేదావివర్గం కూడా తప్పుపట్టింది. దీనిపై ఎట్టకేలకు ఆలస్యంగా స్పందించిన సీఎం జగన్.. నేరుగా చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి.. ఇలా అయితే, మీరు పార్టీలో ఉండొద్దు! అని హెచ్చరించినట్టు ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటు న్నారు. మనం 30 ఏళ్ల అధికారం లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.. విమర్శలు సహజం.. వాటిని పట్టించుకున్నా.. పట్టించుకోనట్టే వ్యవహరించాలి. ఎక్కడ ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి. ఇలా నోరు జారితే.. ఎలా? అని జగన్ స్వయంగా హెచ్చరించారట.
గతంలోనూ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేతలను నీయమ్మ మొగుడు.. అంటూ వ్యాఖ్యానించిన సందర్భంలోనూ జగన్ ఆయనకు స్వయంగా వార్నింగ్ ఇచ్చారని, తర్వాత నాని సైలెంట్ అయిపోయారని ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా ద్వారం పూడికి ఇలాంటి వార్నింగే జగన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆ తర్వాత ద్వారంపూడి మీడియా కంటికి కనిపించడం లేదు.!