ఐటి దాడుల వెనుక రాజకీయ కోణం ఉందా.. టార్గెట్ కెసిఆరా..?

-

టాలీవుడ్ ని ఐటి దాడులు ఇబ్బంది పెడుతున్నాయి. వరుస ఐటి దాడులతో… నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. గత నెల నుంచి ఐటి అధికారులు అగ్ర నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటి దాడులు చేసిన అధికారులు… సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల ఇళ్లల్లో దాడులు చేశారు. ఈ సందర్భంగా కొన్ని పత్రాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

కొన్ని రోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ సోదాలు చేసిన అధికారులు కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అనే ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు అధికారులు. ఆయన సోదరుడు, ప్రముఖ హీరో వెంకటేష్, నానీ ఇళ్లపై సోదాలు చేశారు. రామానాయుడు స్టూడియో తో పాటు వారి నివాసాల్లోనూ సోదాలు చేశారు. బుధవారం ఉదయం నుంచి పది బృందాలుగా విడిపోయిన అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు.

అసలు ఇప్పుడు ఈ దాడులకు కారణాలు ఏంటి…? ఈ ప్రశ్నకు సమాధానం సినీ పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాలు కూడా వెతికే పనిలో పడ్డాయి. రెండు నెలల క్రితం రాష్ట్ర పోలీసుల ప్రమేయం లేకుండా కేంద్ర బలగాల పహారాలో… ముఖ్యమంత్రి కెసిఆర్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మేఘా కృష్ణా రెడ్డి ఇంటిపై ఐటి దాడులు చేశారు అధికారులు. కనీసం స్థానిక పోలీసులకు ఏం జరుగుతుంది అనే సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ వార్త మీడియాలో కూడా పెద్దగా రాలేదు. అక్కడక్కడా రావడం మినహా ప్రధాన మీడియా చూపించలేదు.

ఇప్పుడు మంత్రి కేటీఆర్ కి సన్నిహితంగా ఉండే నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని ఐటి దాడులు చేస్తుంది. సురేష్ బాబుతో కేటీఆర్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక ఏషియన్ సినిమాస్ కి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. రాష్ట్రంలో బలపడాలి అని భావిస్తున్న బీజేపీ తెరాస ని ఆర్ధికంగా దెబ్బ కొట్టడానికి ఈ దాడులు చేస్తుందని అంటున్నారు. త్వరలో కేటీఆర్ తో సన్నిహితంగా ఉండే అక్కినేని నాగార్జున మీద కూడా ఐటి దాడులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అసలు ఈ దాడులకు సంబంధించి,

పూర్తి వివరాలు తెలియకపోయినా కెసిఆర్ ను లక్ష్యంగా చేసుకునే ఇవి జరుగుతున్నాయని… త్వరలో కొందరు తెరాస బలమైన నేతల మీద కూడా ఈ దాడులు జరిగే అవకాశం ఉందని, వారు ఎన్నికలకు ఎంత వరకు ఖర్చు చేశారు అనే దాని మీద కూడా ఆరా తీసే అవకాశం ఉందని సమాచారం. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఐటి దాడులు తెలంగాణ ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బంది పెట్టినట్టే కనపడుతుంది. కొన్ని అరెస్ట్ లు కూడా ఉండే అవకాశం ఉందని… విచారణలు కూడా కొందరిని పిలుస్తారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version