గుజరాత్‌కు చెందిన ఒక వ్యాపార దిగ్గజంపై ఆదాయ పన్ను(ఐటీ) విభాగం జరిపిన సోదాల్లో రూ.1,000 కోట్లకు పైగా ‘లెక్కల్లో చూపించని’ ఆదాయం కనిపించిందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఇందులో రూ.24 కోట్ల నగదుతో పాటు రూ.20 కోట్ల విలువైన ఆభరణాలు, బులియన్ తదితరాలను జప్తు చేసినట్లు తెలిపింది.
జులై 20న హైదరాబాద్‌తో పాటు ఖేడా, అహ్మదాబాద్, ముంబయి, కోల్‌కతాలలోని కంపెనీకి చెందిన 58 ప్రాంగణాల్లో సోదాలు జరిగినట్లు తెలిపింది. ఈ ‘ప్రముఖ’ కంపెనీ జౌళి, రసాయనాలు, ప్యాకేజింగ్, స్థిరాస్తి, విద్యా రంగాల్లో వ్యాపారాలున్నాయని సీబీడీటీ తెలిపింది.
ఐటీ దాడుల సమయంలో పత్రాలు, డిజిటల్ డేటాను జప్తు చేశారు. ఖాతా పుస్తకాల వెలుపల పలు నగదు విక్రయాలను జరపడం; బోగస్ కొనుగోళ్ల బుకింగ్, స్థిరాస్తి లావాదేవీలకు నగదు రశీదులు ఇవ్వడం ద్వారా ‘పెద్ద స్థాయి’లో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సీబీడీటీ పేర్కొంది. ‘కోల్‌కతాకు చెందిన డొల్ల కంపెనీల నుంచి లావాదేవీలు జరిపినట్లు తెలుస్తోంద’ని వివరించింది. తన కంపెనీలకు చెందిన షేర్ల ధరలను ఆపరేటర్ల ద్వారా హెచ్చుతగ్గులకు గురి చేసే లాభాలను పొందిందనీ తెలిపింది.