టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిరాకరణతోనే ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వ్‌స్ట్‌మెంట్ రీజియన్) ప్రాజెక్ట్ ఆగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తాండూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫలక్‌నుమా నుంచి శంషాబాద్ ఏయిర్‌పోర్ట్‌కు ఎంఎంటీఎస్, మెట్రోరైలు పొడగింపు, పంజాగుట్ట– ముత్తంగి, ఉప్పల్ అన్నాజీౖగూడ, మూసాపేట్–బీహెచ్‌ఈఎల్ రేడియల్ రోడ్ల అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు వ్యతిరేకతో ఎదురవ్వడంతో దాన్ని దారి మళ్లించేందుకు టీఆర్‌ఎస్ కొత్త కొత్త ప్రణాళికలు రూపొందిస్తుందని, ఇదంతా యువతకు అర్థమైందన్నారు.
తప్పుదోవ పట్టిస్తూ..
ఐటీఐఆర్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యచరణ ప్రారంభించకుండానే ప్రధాని దృష్టికి తెచ్చాం.. దత్తాత్రేయకు లేఖ అందించామంటూ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ఐటీఐఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆగిపోయేలా చేసిందని.. 2017 కాగ్ నివేదిక అధ్యయనం ద్వారా ఈ విషయం తేట తెల్లమైందన్నారు. కేంద్రం ప్రత్యేక చొరవతో 914 ఏకరాల్లో భాగ్యనగరానికి ఈ–సిటీ, ఎలక్ట్రానిక్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌లను మంజూరు చేసిందని గుర్తు చేశారు. హైదరాబాద్ నలుమూలలలోని వివిధ క్లస్టర్లలో ఐటీ, హార్డ్‌వేర్ పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు మౌలిక వసతులు కల్పిచడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.