ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు పుణ్యమా అని రాష్ట్రంలో రాజకీయం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఆరు వారాల పాటు ఎన్నికల కోడ్ అమలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం దుమారం రేపింది. ఇక అధికారులను బదిలీ చేయడం కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా విమర్శలు చేసారు. ఏ విధంగా అధికారులను బదిలీ చేస్తారని ప్రశ్నించారు.
ఇక ఇదిలా ఉంటే జగన్ చేసిన విమర్శలకు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. “ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉందా అనే ఒక్క విషయం తప్పితే మిగిలిన అన్ని విషయాలలో అధికారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై పూర్తయ్యేవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాని దే.” అని ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు నిఘా విభాగం అధిపతిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఇదే విధంగా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అప్పుడు వైసీపీ నేతలు ఆ నిర్ణయాన్ని సమర్ధించారు. అదే విధంగా పలువురు అధికారులను అప్పట్లో బదిలీ చేసారు. అప్పుడు టీడీపీ చేసిన ఆరోపణలను ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్నారు. మరి ఈ అంశం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.