ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుకు జగన్ మరో డెడ్ లైన్ విధించారు.. ఆయనకు కేవలం వారం రోజులే సమయం ఇచ్చారు. ఈ డెడ్ లైన్ దేనికోసం అంటారా.. విజయవాడ కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చేందుకు.. నిబంధనలను ఉల్లంఘించిన కృష్ణానది కరకట్ట సమీపంలో కట్టిన నివాసంలో చంద్రబాబు అద్దెకు ఉంటున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈ భవనాన్ని వారం రోజుల్లో కూల్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు అద్దెకు ఉంటున్న నివాసానికి సీఆర్‌డీఏ నోటీసులు అంటించింది. అక్రమ కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆ నోటీసుల్లో సీఆర్‌డీఏ అధికారులు పేర్కొన్నారు. అక్రమ కట్టడాల యజమానులు ఆ పని చేయకపోతే.. తామే తొలగిస్తామని ఇంటి యజమాని లింగమనేని రమేష్‌కు నోటీసులు అందిచారు.
ఆయన ఆ భవనంలో ఉండటం లేదు కాబట్టి.. భవనం గోడకు నోటీసులు అంటించారు సీఆర్‌డీఏ అధికారులు.. తాము ఇప్పటికే ఒకసారి గతంలో నోటీసులు జారీ చేసామని కొత్త నోటీసులో తెలిపారు. కానీ దానికి భవన యజమాని నుంచి సంతృప్తికర సమాధానం రాలేదని నోటీసుల్లో తెలిపారు.
దీన్నిబట్టి చూస్తే మరో వారం రోజుల్లో చంద్రబాబు నివాసం ఉంటున్న అద్దె భవనాన్ని కూల్చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే విజయవాడ కరకట్టపై అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అక్కడి నుంచి ఖాళీ చేయించాలనే ఉద్దేశంతోనే పక్కనే ఉన్న ప్రజావేదికను కూడా కూల్చేశారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి.