జమ్మలమడుగు పంచాయతీ పై క్లారిటీ ఇచ్చిన జగన్..మళ్లీ ఆయనకే ఛాన్స్

-

జమ్మలమడుగు వైసీపీ పంచాయితీ ఆసక్తికర మలుపు తీసుకుంది. కడప జిల్లా జమ్మలమడుగులో ఒకప్పుడు రామసుబ్బారెడ్డి,ఆదినారాయణరెడ్డిల మధ్య పొలిటికల్ వార్ నడిచేది. ఇద్దరూ మాజీ మంత్రులే. మారిన రాజకీయ పరిణామాలతో ఎవరు దారి వారు చూసుకున్నారు. ఇప్పుడు జమ్మలమడుగు పంచాయితీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య నడుస్తుంది. అయితే ఈ గ్రూపు విభేధాల పై దృష్టి పెట్టిన సీఎం జగన్ నాన్చకుండా విషయం తేల్చేశారు. మళ్లీ ఎమ్మెల్యేగా ఎవరికి చాన్స్ అన్నది క్లారిటీ ఇచ్చేశారు.


మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అధికార వైసీపీ పార్టీలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఆ తర్వాత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి,రామసుబ్బారెడ్డి మధ్య ఆదిపత్యపోరు నడుస్తుంది. వీరి మధ్య సయోధ్యకు పార్టీ పెద్దలు పలుమార్లు ప్రయత్నించినా సక్సెస్‌ కాలేదు. ఇంతలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నియోజకవర్గంలో వర్గపోరు పై నాన్చకుండా తేల్చిపారేశారు వైసీపీ అధినేత సీఎం జగన్. ఈరోజు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి తాడేపల్లిలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. పార్టీలో క్రియాశీలకంగా ఉండి,సముచిత గౌరవం ఇచ్చేలా రామసుబ్బారెడ్డికి సీఎం హామీ ఇచ్చారు

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ కష్టకాలంలో నిలబడి పోరాడారు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి రానున్న ఎన్నికల్లో సుధీర్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే గా పోటీ చేస్తారు అని స్పష్టతనిచ్చారు జగన్. 2023లో వచ్చే శాసనమండలిలో రామసుబ్బారెడ్డి కి అత్యున్నత పదవి కట్టబెడతామని జగన్ హామీ ఇచ్చారు. ఒక వేళ నియోజకవర్గ విభజన జరిగితే మాత్రం చెరో స్థానం కేటాయిస్తామన్నారు. ఇక జిల్లా రాజకీయాల్లో సైతం రామసుబ్బారెడ్డి కీలకంగా ఉంటారని ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తారని ఎంపీ అవినాష్ రెడ్డి కో ఆర్డినెట్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు.

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పై రామసుబ్బారెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ఇక్కడ ముక్కుసూటి రాజకీయం చేయాలని సీఎం భావిస్తున్నారని ఆయన నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. పార్టీలో క్రియాశీలకంగా తగిన గుర్తింపు ఇస్తామని సీఎం హామి ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు నేను, మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తాం అన్నారు రామసుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version