పెద్దగా సడలింపులు లేని లాక్ డౌన్ 2.0 సమయంలో ఇతరరాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రులను సొంత రాష్ట్రానికి రప్పించడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన కృషి మామూలుది కాదనే చెప్పాలి. ఉన్నఫలంగా వారిని సముద్రమార్గం ద్వారా ఏపీకి పంపాలను గుజరాత్ లో చిక్కుకున్న మత్స్యకారుల గురించి అక్కడి సీఎం తో చర్చించడం, అనంతర పరిణామాలు తెలిసినవే. ఈ క్రమంలో విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిగురించి ఇప్పుడు జగన్ ఆలోచించడం మొదలుపెట్టారు!
లాక్‌డౌన్ 3.0లో భాగంగా సడలింపులు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది! ఈ విషయంలో ఒకడుగు ముందుకేసి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ను.. సహకరించాలని సీఎం జగన్ కోరారు. ఈ మేరకు ఆయనకు సీఎం జగన్ లేఖ రాశారు. కువైట్, దుబాయ్ వంటి దేశాల్లో వలసదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోందని, అయితే ఈ రిజిస్ట్రేషన్ సమయంలో తెలుగు వారికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా… విదేశాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు వలసదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అక్కడి అధికారుల ద్వారా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు జగన్. అలాగే.. స్వదేశానికి వస్తున్న వారి రిజిస్ట్రేషన్ వివరాలను కూడా తమ రాష్ట్రానికి అందించాలని ఏపీ సీఎం కోరారు. దీని వల్ల తాము క్వారంటైన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా… దుబాయ్, కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారిని వారి స్వస్థలాలకు తీసుకువచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపిన సీఎం జగన్… వారంతా స్వదేశం చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవ తీసుకోవాలని కేంద్రాన్ని సీఎం జగన్ కోరారు.