ఒక్కఛాన్స్ ఎలాంటి వారికైనా ఊపు తెస్తుంది. అదే ఛాన్స్ కోల్పోతే.. ఎలాంటి వారినైనా డమ్మీలను చేస్తుంది. రాజకీయాల్లో ఇది కామన్. అయితే, ఒక్క ఛాన్స్ అందుకున్న వైసీపీ నాయకులు.. ఏదో ఊపు తెచ్చుకోవడం కాదు.. అదిరిపోయే ఊపుతో ముందుకుసాగుతున్నారు. మళ్లీ ఓటంటూ వేస్తే.. వీరికే వేయాలనే రేంజ్‌లో ప్రజలు చర్చించుకునేలా చేస్తున్నారు. ఇలాంటి వారిలో కృష్ణాజిల్లా మచిలీపట్నం నుంచి గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన పేర్ని నాని ముందు వరుసలో ఉన్నారు. జగన్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్న పేర్ని.. తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు.
మంత్రిగా పేర్ని నాని రెండు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారు. ఒకటి.. మంత్రిగా తాను జగన్‌ను మెప్పించడం, అదేసమయంలో తనకు ఓట్లేసి గెలిపించిన మచిలీపట్నం నియోజకవర్గం ప్రజలను సంతృప్తి పరచడం. అయితే, ఈ రెండు లక్ష్యాల్లోనే మరో కోణంలో ఆయన ప్రతిపక్షంపై పైచేయి సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికంగా గత ఏడాది ఓటమి పాలైన టీడీపీ నాయకు డు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు అడుగడుగునా చెక్ పెడుతున్నారు. ఒకవైపు మంత్రిగా తన శాఖను పర్యవేక్షిస్తూనే.. మరోవైపు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.
ఇప్పుడంటే కరోనాతో లాక్‌డౌన్ అమలవుతోందికానీ, లాక్‌డౌన్కు ముందు పేర్ని.. తన నియోజకవర్గంలో బుల్లెట్‌పై తిరుగుతూ ప్రతి వీధిముందు నిలబడి ప్రజలను పలకలించారు. వారి సమస్యలను తెలుసుకు న్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మత్స్యకారుల సమస్యలను ఆయన అధ్యయ నం చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇక, లాక్‌డౌన్ సమయంలోనూ నియోజకవర్గం లో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. తానేస్వయంగా ట్రాక్టర్ నడుపుతూ.. కరోనా నిరోధక ద్రావణాన్ని పిచికారీ చేశారు. దీంతో ప్రజలకు మరింత సన్నిహితంగా దూసుకుపోయారు. ఇప్పుడు కొల్లు రవీంద్ర ఇక్కడి సమస్యలపై విమర్శలు చేయాలన్నా కూడా అవకాశం లేకుండా పోయిందని అంటున్నారు స్థానికులు.