కరోనా వ్యాక్సిన్ ప్లాన్ మీద ఏపీ సిఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నాలుగు, ఐదు వారాల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ జరగాలని ఆయన ఆదేశించారు. సోమవారం నుంచి అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ మరో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందన్న అయన ఈ ఎన్నికలు వెంటనే పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్‌పై పూర్తి దృష్టి పెట్టేవాళ్లం.. కాని అలా జరగలేదని అన్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉందని, దీనివల్ల వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు వచ్చే పరిస్థితి ఉందని అన్నారు.
అధికార యంత్రాంగంలో సందిగ్ధ వాతావరణం ఉందని, ఇలాంటి సందిగ్థత వాతావరణం మధ్య అంతా ఉన్నామని అన్నారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరు? చాలా ఆవేదన కలుగుతోందిని అన్నారు. వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంచేయండి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే యజ్ఞం ముమ్మరంగా కొనసాగాలన్న ఆయన వీలైనంత త్వరగా విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకు రావాలని అన్నారు. వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయి యాక్టివిటీగా గ్రామాల్లో చేపట్టాలని ఆదేశించారు.