రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ లేఖ ఎవరు రాసారు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. బుధవారం సాయంత్రం ఈ లేఖ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళింది. దీనితో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది.
ఈ లేఖ వ్యవహారంపై టీడీపీ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నా రమేష్ కుమార్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. దీనితో ఇప్పుడు ఈ లేఖ వ్యవహారం వెనుక రమేష్ కుమార్ ఉన్నారా అనే దానిని ఆరా తీస్తున్నారు. లెక్కలతో సహా లేఖ వెళ్ళడంతో దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ లేఖపై మంత్రులు తీవ్ర స్థాయిలో స్పందించారు. రమేష్ కుమార్ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.
ఈ లేఖపై మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి డీజీపీకి ఫిర్యాదు చెయ్యాలని భావిస్తున్నారు. గురువారం సాయంత్రం వాళ్ళు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కూడా ఈ లేఖ విషయాన్ని అంత సిల్లీగా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ మనీష్‌కుమార్‌తో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ కేంద్రం హోంశాఖకు రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖపై ఆయన వారితో చర్చించారు. అసలు ఎవరు పంపారు అనే దానిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది.