ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఏపీలో సంక్షేమ పథకాల అమలు విషయంలో దేశవ్యాప్తంగా జగన్ తన ప్రత్యేకతను చాటి చెప్పుకోవడంతో పాటు, ఏ రాష్ట్రంలోనూ , ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో వరాల జల్లులు కురిపిస్తున్నారు. వాటిని అమలు చేసి చూపిస్తున్నారు. జనాల్లో చిరస్థాయి ముద్ర వేసుకునేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తున్నారు. దీంతో జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది అంటూ వైసీపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటూ, జనాల్లో తమ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఉప్పొంగిపోతున్నారు. ఇప్పుడు మాత్రమే కాకుండా, రానున్న రోజుల్లో జగన్ హవా ఇదేవిధంగా కొనసాగుతుందని నమ్మకంగా చెప్పుకుంటున్నారు. ఇక ప్రతిపక్షాలు జగన్ పరిపాలనపై విమర్శలు చేస్తున్నా, జనాలలోనూ పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. ఇవన్నీ ఇలా ఉంటే , వీరందరి అభిప్రాయాలకు భిన్నంగా కేంద్రంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ కాగ్ జగన్ ఏడాది పాలనపై నివేదికను సమర్పించింది.
పేదలకు ఉచిత పథకాల పేరుతో ఈ విధంగా నిధులను మళ్ళించడం వల్ల రానున్న రోజుల్లో అభివృద్ధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతాయి అని, దుబారా నియంత్రణలో ప్రభుత్వం కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నా, నిధులను నిర్దిష్ట పనులను ఖర్చు చేయడం వంటి విషయాల్లో ముందుచూపుతో వ్యవహరించడం లేదని తన నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత ఆదాయ లను పెంచడం పైన ఏపీ ప్రభుత్వం సరైన రూట్లో వెళ్లడం లేదని, దీని ప్రభావం జీడీపీ పెంపు పై ప్రభావం పడుతోందని, ఆదాయ వృద్ధి మార్గాలను అన్వేషించడం లేదని కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధులను ఇదే విధంగా సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తున్నారని, కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.