రాజకీయ పరంగా బీజేపీ తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక రెండు చోట్ల నుంచి పోటీ చేసి రెండు చోట్ల కూడా ఓటమి పాలయ్యారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రెండు సీట్లను వేరే వాళ్లకు అప్పగిస్తారని అంటున్నారు.
ఆయన రాయలసీమలోని తిరుపతి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు చిరంజీవి కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. అంతే కాకుండా ఎన్టీఅర్ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లారని, సినీ నటుల్ని రాజకీయ నాయకులను చేసి అసెంబ్లీకి పంపిన తిరుపతి ప్రజలు పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీకి పంపిస్తానని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
ఎన్టీఆర్ కు, తన అన్న చిరంజీవికి కలిసొచ్చిన తిరుపతి పవన్ కళ్యాణ్‌కు కూడా అంంతే కలిసొస్తుందని జనసేన కార్యకర్తలు నమ్ముతున్నారు. ఈ విషయం పై పవన్ కళ్యాణ్ మాత్రం ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అంతే కాకుండా తాను ఎక్కడి నుంచి పోటీ చేసే విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం సాధ్యంకాదని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఎప్పుడో ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అవసరం ఏంటీ అనే ప్రశ్న వినపడుతుంది.