సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు తాడిపత్రి రాజకీయాల్లో చిచ్చు రాజేసింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎడ్ల బండ్లలో తరలించే ఇసుకకూ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ జేసీ వర్గీయులు పోస్ట్ చేయడం కలకలం రేపింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ…నేరుగా జేసీ ఇంటికెళ్లారు పెద్దారెడ్డి. దాంతో జేసీ అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటన మీద రిపోర్ట్ చేసేందుకు సిద్ధంగా లేనని జేసీ ప్రభాకర్ పోలీసులతో చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోతో మాకు సంబంధం లేదన్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆడియో ఎక్కడి నుంచి వచ్చిందో తేలుస్తారని అన్నారు. మా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దాదాగిరీ చేయాలనుకున్నారని ఆయన అన్నారు. కేతిరెడ్డి మా ఇంట్లోకి వస్తున్నా పోలీసులు ఆపే ప్రయత్నం చేయ లేదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో మేం ఎవర్నీ నిలబెట్టకుండా భయపెట్టాలని చూస్తున్నారన్న ఆయన మేం ఎవరికీ భయపడం, ఎన్నికల్లో నిలబడేందుకు మా వాళ్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వికలాంగుడైన మా కంప్యూటర్ ఆపరేటర్‌ను కొట్టి వెళ్లిపోయారని మా ఇంటికి కొడవళ్లు కూడా తెచ్చారు.. వాటితో ఏం పని? అని అయన ప్రశ్నించారు.