సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ రాజకీయ వ్యవహారంపై గడిచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో భారీ ఎత్తున వార్తలు వైరస్ మాదిరిగా వైరల్ అవుతున్నాయి. ఆయన వైసీపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని, అందుకే జగన్ ప్ర భుత్వాన్ని ఆయన పరోక్షంగా సమర్ధిస్తున్నారని, త్వరలోనే ఆయన వైసీపీలో చేరిపోవడం తథ్యమని కూడా సోషల్ మీడి యాలో వార్తలు వస్తున్నాయి. అయితే, అసలు వాస్తవం ఏంటి? నిజంగానే జేడీ వ్యూహం వైసీపీలోకి రావడమేనా? అందుకే ఆయన జనసేనను వదులుకున్నారా? ఇదే జరిగితే.. జగన్ విషయం ఏంటి? ఆయనపై అప్పట్లో సీరియస్‌గా కామెంట్లు చేయడంతో పా టు.. కేసులు కూడా నమోదు చేసిన జేడీని జగన్ ఎలా సమర్ధిస్తారు?
నిజానికి రాజకీయాల్లో అయితే, గతంలో ఎన్ని తిట్టుకు న్నా.. ఎన్ని విధాల విమర్శలు చేసుకున్నా.. పార్టీలు మారడం, కండువా లు మార్చడం వంటివి సహజమే. కానీ, జగన్‌పై గతంలో కేసులు నమోదు చేసింది జేడీ ఓ అధికారిగా. అంతేకాదు, జగన్‌పై తీవ్ర కేసులు ఉన్నాయని చెప్పింది కూడా ఓ సీనియర్ ఐపీఎస్‌గానే. నిజానికి ఇవి నైతికంగా జగన్‌పై తీవ్రప్రభావం చూపాయి. ఇప్పటి కీ ఆయన ఈ విమర్శల కారణంగా రాజకీయంగా కూడా పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అలాంటి అధికారిని తిరిగి తన పార్టీలోకి చేర్చుకోవడం అంటే ఆలోచించాల్సిన విషయమే.
ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ.. సుమారు ఏడాదిన్నర కిందట రాజకీయంగా ముందుకు వచ్చిన లక్ష్మీనారాయణకు వ్యూహం ఉందా? పోనీ.. ఓ నాయకుడిగా ఆయన తనను తాను నిరూపించుకున్నారా? అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం.. జనసేనలో ఆయన అడుగు పెట్టారు. అధినేత పవన్‌తో పెద్దగా కలిసిపోయింది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జన సేన నేతలు.. పార్టీ అధినేత పవన్ అడుగుజాడల్లో నడిచారు. కానీ, జేడీ మాత్రం తనకు భిన్నమైన రాజకీయాలు చేశారు. తనను గెలిపిస్తే.. ఇవి చేస్తానంటూ.. ఆయన ఏకంగా వంద రూపాయల స్టాంపు పేపర్‌పై నియోజకవర్గం ప్రజలకు రాసి ఇచ్చారు. నిజానికి ఇది పారదర్శకమే అయినా.. అప్పట్లో పవన్ ఇలాంటివి వద్దని సుతిమెత్తగా వారించారు. కానీ, జేడీ వినిపించుకోలేదు.
ఆ తర్వాత కూడా పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించినా.. తన సొంత కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, పవన్ సినిమాల్లోకి వెళ్తానని ప్రకటించగానే ఆయనతో విభేదించారు. ఇలా నిలకడలేని రాజకీయాలు చేసే జేడీ.. కఠినంగా ఉండే వైసీపీ రాజకీయాలతో ఏమేరకు పొసగగలరు? అనేది ప్రధాన ప్రశ్న. మొత్తానికి జేడీ వ్యవహారంపై వైసీపీలో ఇదే తరహా చర్చ నడుస్తోంది. ఆయనను పార్టీలోకి తీసుకున్నా.. ప్రజల మధ్య ఆయన సాధించేది కూడా ఉండదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.