హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు జిమ్ క్యారీ.. ఓ మహిళా జర్నలిస్టుకు ఇచ్చిన చిలిపి సమాధానం ఆయనను ఇరకాటంలో పడేసింది. ఎంతో గౌరవ మర్యాదలున్న నటుడు ఓ మహిళా జర్నలిస్టుపట్ల అమర్యాదకరంగా వ్యవహరించడం కరెక్టుకాదని కొందరు అంటుంటే.. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది? నవ్వించడం కోసం జోక్ చేశాడని కొందరు లైట్ తీసుకుంటున్నారు.
58 ఏండ్ల జిమ్ క్యారీ బుధవారం హీట్ మ్యాగజీన్‌కు చెందిన మహిళా రిపోర్టర్ చార్లొట్టే లాంగ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ‘సోనిక్ ది హెడ్జ్హాగ్’ అనే సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ఇంటర్వ్యూ జరిగింది. ఈ సందర్భంగా రిపోర్టర్ చార్లొట్టే.. ‘మీ కెరీర్లో మీరు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించారు. అయితే ‘సోనిక్ ది హెడ్జ్హాగ్’ అనే సినిమాలో సోనిక్‌కు ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది. అలా మీ బకెట్ లిస్టులో కూడా సాధించాల్సినవి ఏమైనా మిలిగి ఉన్నాయా?’ అని ప్రశ్నించింది.
చార్లొట్టే ప్రశ్నకు జిమ్ క్యారీ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ‘ఇక నువ్వే మిగిలి ఉన్నావు’ అన్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన చార్లొట్టే.. నోరు అం..త పెద్దగా తెరిచి రెండు చేతులతో మూసుకుంది. ఆ క్షణంలో మళ్లీ అందుకున్న జిమ్ క్యారీ ‘అంతే, ఇప్పుడు అన్నీ అయిపోయాయ్’ అన్నాడు. ఈ మాటతో చార్లొట్టేకు మరోసారి నోటమాట రాలేదు. అందుకే కొద్ది క్షణాలు ఆగి తేరుకున్న ఆమె ‘మీతో ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు’ అన్నారు. అప్పటికి కూడా మనోడు ఏ మాత్రం తగ్గలేదు. ‘నా మాటలను జస్ట్ ఆస్వాదించు అంతే’ అన్నాడు.
ఈ ఇంటర్వ్యూను మహిళా జర్నలిస్టు చార్లొట్టే తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. జిమ్ క్యారీ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన స్థాయికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన గౌరవాన్ని తగ్గించిందని, ఈ వ్యాఖ్యల తర్వాత ఆయన నీచంగా కనిపిస్తున్నారని ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారని. అయితే కొందరు మాత్రం జిమ్ క్యారీ వ్యాఖ్యలను సమర్థించారు. కాస్త నవ్వుకోవడం కోసం కొన్ని సరస సంభాషణలు చేయడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.