ప్రజలను కాటు వేసేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎంగా తాను ఏం చేశానో చెప్పుకుని ఓట్లడగటం సహజమని, కానీ అలాంటిదేమీ లేకుండా జనాన్ని కాటు వేస్తున్నాడు చంద్రబాబు అంటూ ఆయన ధ్వజమెత్తారు. సినిమా స్టైల్ లో జనం ముందు నాటకాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. 86 నియోజకవర్గాల్లో టీడీపీకి దిక్కేలేదని సొంత సర్వేలోనే తేలిందన్నారు. గతంలో ఏవైనా మంచిపనులు చేస్తే జనం గుర్తు పెట్టుకుంటారన్నారు. అవి చేయనందునే 23 సీట్లకు దించేశారని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం ఎన్ని డ్రామాలైనా చేస్తాడన్నారు మంత్రి జోగి రమేశ్. బీసీల్లో 82 వేలమందిని జగన్ లీడర్లుగా తయారు చేశారని, జయహో బీసీ, జయహో జగనన్న అనే నినాదం రాష్ట్రమంతా మార్మోగుతోందన్నారు జోగి రమేశ్.
లోకేష్ రాజకీయ అజ్ఞాని, అక్కుపక్షి అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇష్టానుసారం ట్వీట్లు పెడుతున్నారని, రాష్ట్రపతి వచ్చినప్పుడు భద్రతలో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేస్తే దానిమీద కూడా విమర్శలు చేయటం లోకేష్ కే చెల్లిందని జోగి రమేశ్ అన్నారు. ఇలాంటి నీచమైన సంస్కృతికి చంద్రబాబు, లోకేష్ అలవాటు పడ్డారని, పిచ్చికుక్కల్లాగ జనాన్ని కాటు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. అంతేకాకుండా.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై జోగి రమేష్ సంచలనం వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబు, లోకేష్ పాత్ర కూడా ఉందన్నారు. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని, అందరి తప్పులూ బయటకు వస్తాయని, వారిద్దరు కూడా బొక్కలోకి పోవటం ఖాయమన్నారు జోగి రమేశ్.